ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ పెద్దగా లేని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యక్రమాలు పునఃప్రారంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. పది అంతకన్నా తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్‌డౌన్ పాక్షికంగా సడలించే అంశంపై ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ దృష్టి పెట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 45 జిల్లాల్లో కరోనా కేసులు పదికన్నా తక్కువే నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో చిన్నతరహా పరిశ్రమలను తిరిగి తెరిస్తే బాగుంటుందని రాష్ట్రంలోని 11 ప్రధాన కమిటీల చైర్‌పర్సన్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని షెల్టర్ హోమ్స్ ను జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచేందుకు అన్ని దవాఖానల్లో పూల్ టెస్టింగ్‌ను పెంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులు తీరకుండా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు.